గ్రోత్/సముదాయాలు/కొత్తవాడుకరులతో సంభాషించడం ఎలా
కింది మార్గదర్శకం, వికీమీడియా వికీల్లోని అనుభవజ్ఞులైన వాడుకరులు సహాయ కేంద్రాల్లోను, ప్రశ్న జవాబుల పేజీల్లోనూ కొత్తవారితో మాట్లాడడంలో సహాయకంగా ఉండేందుకు తయారు చేసాం. గురూపదేశాలవంటి చోట్ల, వాడుకరుల పరస్పర సంప్రదింపుల్లోను కూడా ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
వివిధ వెబ్‌సైట్ల (వికీమీడియా వికీలు, ఇతర ప్రశ్న-జవాబుల వెబ్‌సైట్లు...) నుండి ఉత్తమ పనిపద్ధతులను, కొత్త వాడుకరులతో సంభాషిస్తూ ఉండే వికీమీడియా అనుభవశాలుర ఆలోచనలనూ ఈ డాక్యుమెంటు సేకరించింది. ఫ్యాబ్రికేటర్లో ఈ సేకరణకు సంబంధించిన మరిన్ని వివరాలను చూడవచ్చు.
మార్గసూచీ
విజయవంతమైన సంభాషణలు జరపడమెట్లా
- ఎప్పుడూ మైత్రీభావంతో, మర్యాదగా, ఓపికగా ఉండండి - కొత్తవారు ఆ సంగతులను మరచినా కూడా.
- "నమస్కారం, స్వాగతం!" అంటూ మీ సమాధానాన్ని మొదలుపెట్టండి
- అడిగిన ప్రశ్నను అర్థమైందని రూఢిపరచుకోండి. సమస్యను ఊహించే ప్రయత్నం చెయ్యవద్దు. వివరణ అడగడం సముచితమే; అలా అయితే మీరు కచ్చితమైన సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అడిగిన ప్రశ్న మీకు అర్థం కాకపోతే, "మీరు ఏం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు?" అనే ప్రశ్న అడగడం ఉత్తమం.
- కొత్త వాడుకరి ఏ ఎడిటరు వాడుతున్నారో తెలుసుకోండి (2010 వికీటెక్స్ట్, విజువల్, మొబైలు, 2017 వికీటెక్స్టు, మొదలైనవి.). ఆ ఎడిటరుకు సంబంధించిన సమాధానమే ఇవ్వండి. వాడుకరికి తెలియని వేరే ఎడిటరును వాడమని చెప్పడం వారి నెత్తిన బరువును పెట్టినట్లౌతుంది.
- మీ పరిమితులు తెలుసుకోండి: కొన్నిసార్లు ఏ సమాధానం ఇవ్వాలో మీకు తెలియక పోవచ్చు - ముఖ్యంగా సాంకేతిక విషయాల్లో, లేదా మీకు అంతగా అభిమానం లేని విషయాల్లో. ఆ విషయాల్లో మరింత అనుభవం కలిగిన ఇతర వాడుకరుల సహాయం తీసుకోండి, వెనకాడకండి. సందేశం మీ చర్చ పేజీలో పెడితే, సమాధానమిచ్చేందుకు మీకు సమయం అవసరమైతే, తరువాత సమాధానమిస్తానని ఒక చిన్న సందేశం పెట్టండి.
- నిజాయితీగా ఉండండి: ప్రశ్న మీ వికీకి సంబంధించినది కానట్లైతే ఆ సంగతే చెప్పి ఎందుకో వివరించండి. ఉదాహరణకు, కొద్ది రోజుల్లోనే తొలగింపుకు గురయ్యే అవకాశమున్న పాఠ్యంపై కొత్త వాడుకరి పని చెయ్యడం వృథా ప్రయాస అవుతుంది. అయితే, ఆ పాఠ్యాన్ని ఎందుకు తొలగిస్తారో ఆ వాడుకరికి చెబితే వారు భవిష్యత్తులో ఆ సమస్యను నివారించుకోగలుగుతారు. దాని బదులు వేరే పనిచెయ్యమని వారిని ప్రోత్సహించవచ్చు.
- రకరకాల కారణాల వల్ల కొత్తవారికి వికీ పట్ల కోపంగా, చిరాగ్గా ఉండవచ్చు. వారి కోపం మీపై కాకపోవచ్చు. ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.
- సంభాషణ అంతం లేకుండా సాగుతూ ఉన్నట్లనిపిస్తే, మర్యాదగా దాన్ని ముగించండి.
- ఉల్లాసంగా ఉండండి! కొత్తవారికి సాయపడడం ఒక బరువు లాగా భావించకండి. సమాధానమిచ్చేందుకు మీకు తగు సమయం లేకపోయినా, ఇచ్చే మూడ్ మీకు లేకపోయినా, మరొకరు ఆ పని చెయ్యగలరేమో చూడండి. You can pause mentorship anytime.
- ఇతర గురువుల చర్చ పేజీలను చూడండి. మీరు ఆఫ్‌లైను లోకి వెళ్దామని భావిస్తే, ఇతర గురువులకు ఆ సంగతి తెలియజెప్పండి. మీరు లేని సమయంలో వాళ్ళు మీ పేజీని చూసుకుంటారు.
మంచి సమాధానాలు ఎలా రాయాలి
- వివరించండి
- డాక్యుమెంటేషన్ను ముందు చూడమని చెప్పకండి. ముందు ప్రాసెస్‌ను మీరు వివరించండి. సమాధానానికి లింకు ఇచ్చేకంటే సమాధానమే ఇవ్వడం ఉత్తమం. ఒక్క వాక్యమైనా సరే.. సమాధానం ఇచ్చి ఆ తరువాతే లింకు ఇవ్వండి. ఇచ్చిన లింకు పేజీల్లోని ముఖ్యమైన సమాచారాన్ని ఉదహరించండి. అలా చేస్తే పొడుగాటి పేజీలను చదివే కష్టాన్ని వారికి నివారించవచ్చు.
- ఉదాహరణ: "బొమ్మను చేర్చాలంటే, ముందు మీరు దాన్ని వికీమీడియా కామన్స్ అనే వేరే వెబ్‌సైటు లోకి ఎక్కించాలి. ఆ తరువాత దాన్ని వ్యాసంలో చేర్చవచ్చు. ఇది కొంత తికమకగా అనిపించవచ్చు. అంచేత ఇదిగో ఈ లింకు చదవండి."
- తరువాత ఏమేం చెయ్యాలో చెప్పండి
- తరువాత ఆ వ్యక్తి ఏమేం చెయ్యాలో కూడా చెప్పండి. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చి వదిలెయ్యకండి.
- వ్యక్తిగత సాన్నిహిత్యం చూపండి
- సర్వసామాన్యమైన పదాలతో, ఒకే మూస ధోరణిలో సమాధానాలు ఇవ్వకండి. స్పష్టత తెచ్చుకునేందుకు అవసరమైన ప్రశ్నలు అడగండి. ఎవరి సమస్య వారికి ప్రత్యేకంగా, అలాంటి ఇతర ప్రశ్నలకు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణలు ఇవ్వండి. Each user may have their own problem, which is different from similar ones. Provide examples.
- సరళంగా చెప్పండి
- సాధ్యమైనంత వరకు పరిభాషను, యాక్రోనిమ్‌లనూ వాడకండి. రోజులు గడిచే కొద్దీ నిదానంగా వాటిని పరిచయం చెయ్యవచ్చు. ప్రశ్నకు సంబంధం లేని బోలెడంత సమాచారంతో కొత్త వాడుకరిని ముంచెత్తకండి.
- మార్గదర్శిగా ఉండండి
- ఉదాహరణకు, కొత్త వ్యాసంలో బొమ్మ ఎలా చేర్చాలని ఎవరైనా అడిగారనుకోండి. కాని వారు దానికంటే ముందు చెయ్యాల్సిన పని మూలాలను చేర్చడం అయితే, ఆ సంగతే వారికి చెప్పండి. ఎలా చెయ్యాలో కూడా చెప్పండి. ఈ పని అయిన తరువాత, బొమ్మ చేర్చడం గురించి తప్పక చెబుతానని కూడా చెప్పండి.
- సంభాషణ మొదలు పెట్టండి
- కొత్త వాడుకరిని ఏదో ఒక ప్రశ్న అడిగి మాటల్లో పెట్టండి.
- ఉదాహరణకు, "వికీపీడియాలో నేను ఓ కొత్త వ్యాసం రాయవచ్చా?" అని కొత్త వాడుకరి అడిగితే, "భేషుగ్గా రాయవచ్చు. కాకపోతే వికీపీడియాలో బాగా క్లిష్టమైన పనుల్లో అదొకటి. ఏ అంశం మీద రాద్దామనుకుంటున్నారు? మీ ఆసక్తికి సంబంధించిన వ్యాసాల్లో చిన్న చిన్న పనులు చేస్తే, కొత్త వ్యాసం రాసేందుకు అవసరమైన నేర్పు అలవరచుకోవచ్చు" అని మీరు చెప్పవచ్చు.
- పిలవండి
- మీరు సమాధానమిచ్చాక, ఏదో ఒక పద్ధతిలో కొత్త వాడుకరికి సందేశం పంపించండి. ఉదాహరణకు, వికీటెక్స్టు చర్చ పేజీల్లో ఆ వాడుకరిని ప్రస్తావించండి.
- ప్రస్తుతం, చర్చ పేజీల సాంకేతిక ఏర్పాటు వల్ల, తమ ప్రశ్నకు ఎవరైనా సమాధానమిస్తే ఆ సంగతి కొత్త వాడుకరులకు తెలిసే వీలు లేదు. మీరు విఫలమైన, జయప్రదమైన ప్రస్తావన గమనింపులు ను ఆన్ చేసుకుంటే, మీ ప్రస్తావన సరిగ్గా వెళ్ళిందీ లేందీ తెలుస్తుంది. You also can switch on failed and successful mention notifications to check if you mention has been correctly sent.
- వాళ్ళు సమాధానం ఎలా ఇవ్వాలో వివరించండి
- కొత్త వాడుకరులు చాలామందికి చర్చ పేజీలను ఎలా వాడాలో తెలియదు. అంచేత, 'సమాధానమిచ్చేందుకు, "మూలపాఠ్యాన్ని సవరించు" నొక్కి, నా సందేశం కింద రాసి, ప్రచురించండి' అని మీ సందేశంలో రాయవచ్చు. వాళ్ళకు ఇండెంటేషను గురించి, సంతకాల గురించి అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరు మీ తరువాతి సమాధానంలో చెప్పవచ్చు. సంబంధిత మూస సాయంతో అది నేర్పవచ్చు.
- వెంటబడండి
- వీలైతే, శిష్యుని ప్రశ్నలను, మీరిచ్చిన సమాధానాలనూ మళ్ళీ చూడండి: కొత్త వాడుకరి మరేదైనా విషయం గురించి అడిగి ఉండవచ్చు, లేదా అదే విషయం గురించి అనుబంధ ప్రశ్న అడిగి ఉండవచ్చు. కొత్త వాడుకరులు అనుకోని విధంగా సమాధానాలిచ్చే అవకాశముంది: ఎలా సమాధానమివ్వాలో వాళ్లకు తెలియకపోవచ్చు, సంతకం ఎలా చెయ్యాలో, మిమ్మల్ని ఎలా పిలవాలో (పింగ్) వారికి తెలియక పోవచ్చు.
- ఏదైనా విషయాన్ని మీరు వివరించాక, అది వాళ్లకు అర్థమైందో లేదో, ఉపయోగపడిందో లేదో అడగండి. అది వాళ్లలో బెరుకు తగ్గించి చొరవగా అడిగేలా చేస్తుంది. తద్వారా మీ అనుభవాన్ని మెరుగు పరచుకునేందుకు పనికొచ్చే సమాచారం మీకు దొరుకుతుంది. సంభాషణ ముగిసాక - అందుబాటు లోనే ఉంటానని, అవసరమైతే అడగమనీ చెప్పండి.
- సమాధానాన్ని రాయండి
- పలకరించండి
- వీలైనంత తవరగా స్పందించండి. కొత్తవారు తరచూ లాగిన్ కాకపోవచ్చు. ఈమెయిలు గమనింపులను చేతనం చేసుకుని ఉండకపోవచ్చు. వికీమీడియా సముదాయాల్లో వాడుకరులు అనేక టైమ్ జోన్లకు చెందినవారు ఊంటారు. అలాంటి సముదాయాల్లో పనిచేసిన అనుభవం కొత్త వాడుకరికి ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు వేదిక లోకి వెళ్ళి 24 గంటల పైగా సమాధానం ఇవ్వని ప్రశ్నలేమైనా ఉన్నాయేమో చూడండి.
- సమాధానం ఎలా ఇస్తున్నారో చూసుకుంటూ ఉండండి; భాష శ్రద్ధ వహించండి.
వివరించాలా, నేనే ఆ పని చేసెయ్యాలా?
ఇంటర్‌ఫేసు తోటి, మార్కప్ తోటీ ఇబ్బంది పడే కొత్త వాడుకరులకు సాయపడడం ఇక్కడి లక్ష్యాల్లో ఒకటి. కొన్ని క్లిష్టమైన దిద్దుబాట్లను ఎలా చెయ్యాలో వివరించే కంటే మీరే చేసెయ్యడం కొన్నిసార్లు తేలిగ్గా ఉండవచ్చు. అనేక అంచెలున్న ప్రాసెస్‌ల లోను, సంక్లిష్టమైన వికీ-సింటాక్సు ఉన్నచోట్లా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఆ సంగతి కొత్తవాడుకరికి నిజాయితీగా "అనుభవజ్ఞులకే ఇది క్లిష్టంగా ఉంటుందిలెండి" అని చెప్పెయ్యండి. అయితే మీరు ఎలా చేసారో వారికి వివరించండి, భవిష్యత్తులో పనికిరావచ్చు.
మీ అనుభవమ్మీద ఆధారపడి, తోటి గురువులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మీరే స్వయంగా చేసేకంటే, కొత్త వాడుకరులకు వివరించి వాళ్ల చేతే చేయిస్తేనే వారికి ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు బోధన అనేది అంత సమర్ధవంతంగా ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో వాడుకరిని నిలుపుకోడానికి అది పనికొస్తుంది.
సముదాయం లోని ఇతర సభ్యులపై ఆధారపడండి
ప్రత్యేకంగా ఒక సహాయ వేదికను నిర్వహించడం అనేది సాముదాయిక కృషి. అనేక మంది సహాయకులపై అది ఆధారపడి ఉంటుంది. ప్రతివారికీ వారివారి బలాలు బలహీనతలూ ఉంటాయి. అలాగే వారివారి సమయమూ, శక్తీ కూడా ఉంటాయి.
మీవంటి ఇతర సహాయకులతో మీ అనుభవాలను, ఉత్తమ పనిపద్ధతులనూ పంచుకోండి. వారిచ్చే సలహాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి.
మీకు సమాధానమిచ్చే వారి పట్ల ఆదరంగా ఉండండి. సహాయం చేసేవారికి ధన్యవాదాలు చెప్పండి, మీరివ్వగలిగే సలహాలను మీరు ఇవ్వండి. బాగా సాయం చేస్తున్నవారికి ధన్యవాదాలు చెబుతూనే ఉండండి.
మీరు చేస్తున్న పని గురించి సముదాయానికి చెబుతూ ఉండాలి, మరచిపోవద్దు; మరింత మంది సహాయకులు ముందుకొచ్చేందుకు అది దోహద పడవచ్చు.
ఉదాహరణలు
వివిధ వికీపీడియాల్లో గమనించిన సమాధానాలను బట్టి తయారు చేసిన కొన్ని ఊహాత్మక ఉదాహరణలు ఇక్కడ చూడవచ్చు.
నా కంప్యూటర్లో ఉన్న బొమ్మను వికీ వ్యాసంలో చేర్చడం ఎలా?
- అలా రాయవద్దు
- దీనిపై మార్గదర్శకత్వం కోసం సహాయం పేజీ చూడండి.
- ఇలా రాయండి
- హలో! వికీపీడియాను ఎవరైనా వాడేసుకోవచ్చు. కాపీహక్కులను మేం గౌరవిస్తాం. అంచేత ఏ బొమ్మ పడితే ఆ బొమ్మను వికీలో చేర్చేందుకు అంగీకరించం. విషయాన్ని బట్టి, ఆ బొమ్మను ఎవరు సృష్టించారనేదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఏ వ్యాసంలో బొమ్మ పెట్టాలని అనుకుంటున్నారు? మీరు వాడదలచిన బొమ్మకు కర్త మీరేనా? కాకపోతే, ఆ బొమ్మపై కాపీహక్కులు వేరెవరికైనా ఉన్నాయా?
నా వ్యాసాన్ని తొలగించారు. అది అవమానకరం!
- అలా రాయవద్దు
- తప్పు మీదే: ముందు మీరు సహాయం పేజీలు చదివి ఉండాల్సింది. వికీపీడియాలో మీ ఇష్టమొచ్చిన పని చెయ్యకూడదని, మరీ ముఖ్యంగా విషయాలకు ప్రచారం చెయ్యకూడదనీ ఇప్పుడు మీకు తెలిసింది.
- ఇలా రాయండి
- మీక్కలిగిన చేదు అనుభవానికి సారీ అండీ. నావద్ద ఉన్న సమాచారం ప్రకారం, మీ వ్యాసంలో మూలాల్లేవు. వికీపీడియాలో వ్యాసాల్లో సమాచారమంతా ఎక్కడో ఒకచోట ప్రచురితమై ఉండాలి. ఆ సంగతి ఎవరైనా ధ్రువీకరించుకునేలా కూడా ఉండాలి. మీ వ్యాసం లోని ప్రధానమైన సమస్య అదే. ఆ విషయం గురించిన మూలాల కోసం నేను వెతికాను గానీ, నాకేమీ దొరకలేదు. మీదగ్గరేమైనా ఉన్నాయా? అలాంటి మూలాలేమీ లేనట్లైతే, ఆ విషయమ్మీద వికీపీడియాలో వ్యాసం రాసే సమయం ఇంకా ఆసన్నం కాలేదని భావించవచ్చు.